Monday, September 21, 2015

నా సరిత కధ

రేడియోలో యధావిధిగా జనరంజని. అమ్మ వంటచేస్తుంది. నాన్న బాయిలర్  పొగకు దగ్గుతూ వేన్నీళ్ళకు పుల్లలేస్తున్నారు. చదువురాని మా బామ్మ న్యూస్ పాపర్ను కళ్ళ కద్దుకోని మా తాతయ్య గారికి చదవటానికి సిధ్ధం చేస్తుంది. మా తాత గారు సెకండ్ ఫ్లోర్ ఎత్తునుండి కాఫీ గొంతులో పోసుకుంటున్నారు. చెల్లి చదువుకుంటుంది. నేను, పుస్తకం వెనకాల కుక్కకరిస్తే ప్రధమ చికిత్స ఏం చెయ్యాలో రాసుంటే ఆ బొమ్మాలూ గట్రా చూస్తున్నా.  

ఇంతలో మా నాన్నగారు తగలెట్టాల్సినవన్నీ తగలెట్టేసి చేతులు కడుక్కుంటుండంగా, మా చెల్లి పరిగెత్తుకెళ్ళి కాళ్ళకు నీళ్ళందించి, తర్వాత కాఫీ అందించి, వినమ్రతతో నమస్కరిస్తూ అన్నయ్యనైన నన్ను చూస్తూ అందరికీ చూపిస్తూ మా తాతగారు చూసేవరకు రెండు నిమిషాలు ఆగి, నాన్నగారు 
సిరితా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్ - ఆంటే ఏంటండీ అని అడిగింది. 

నేను వెంటనే మా నాన్నగారేంచెప్తారా అని పుస్తకం పెన్నూ తీసుకుని రాసుకోటాని సిధ్ధంగా ఉన్నా. మా అమ్మ వంటాపేసి మా నాన్న మా నాన్నగారు ఏం చెప్తారా అని చూస్తుంది. మా తాత గారు కూడ అమేజాన్ కాఫీ ఫాల్స్ ఆపేసి మా నాన్న వంక చూశారు, అలాగే మా బామ్మ, సందులో వాళ్ళు, విజయవాడ వాళ్ళు, అటుగా వెళుతున్న గహ్రాంతర వాసులు వాళ్ళ వాళ్ళ పనులాపేసి మానాన్న ఏంచెప్తారా అని ఆశక్తి గా చూస్తున్నారు. 

మా నాన్న ఒకరకమైన కాన్ఫిడెన్స్ తో నవ్వుతూ...మా చెల్లితో కొబ్బరికాయలో నీళ్ళెలావాస్తాయ్ చెప్పు ? అనడిగారు
మా చెల్లి  : అవును నాన్నగారండోయ్ ఎలా వస్తాయి ?
నాన్న : కదా, అదే మరి కొబ్బరి కాయలో నీళ్ళెలావస్తాయో ఎక్కడనుండి వస్తాయో ఎవ్వరికీ తెలుయదు. అలానే జీవితంలో డబ్బుకూడా కొబ్బరికాయలో నీరు మాదిరి వస్తుంది అలానే పోతుంది. డబ్బేకాదు అది ఏదన్నా సరే మనం దేనినన్నా బలంగా కోరుకుంటే ఎక్కడ నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు అదే వచ్చేస్తుంది. అలా కోరుకోవటాన్నే 'సంకల్పం' అంటారు. అన్ని బలాలకన్నా సంకల్ప బలం చాల గొప్పది - అని స్పీచ్ అయిన CMలా శ్రోతలందరిని ఒకసారి చూశారు. అందరూ ఉత్తేజితులై ఆనందంతో ఐదు నిమిషాలు చపట్లు కొట్టారు.
----------------------- 
ప్రతి మనిషి బాల్యం లో ఒక దశ ఉంటుంది. మొదటి సారి సినిమా చూసినప్పుడు, మొదట్లో సినిమాలు చూస్తున్నప్పుడు అదంతా నిజం అని నమ్మే ఆ దశ. నా ఆ దశను  మా జనకులు హనుమంతం గారు ఏలా హాండిల్ చేశారో అన్నదే ఈ రోజు ఈ కధ.
---------------------
నేను పెరిగిన వాతావరణానికి ఐదో తరగతి వరకు అసలు సినిమానే చూడలేదు. చూడాలన్న కోరిక కూడా ఏరోజూ కలగలేదు. ఏదో అప్పుడప్పుడు  సాయంత్రం ఏడింటికి టై కట్టుకునే అంకుల్ మా టివి లో కొచ్చి వార్తలు చదివేవారు. ఆయన్ని చూడటానికి కూడా రెండిబ్బందులుండేవి 
1) మా బామ్మ సారెలో తెచ్చిన గడియారం సరిగా టైం చూపించాలి.
2) మా ముత్తాత గారికి కోపం రాకూడదు ( మా ముత్తాత గారు చనిపోయి కాకయ్యారని, కోపం వచ్చినప్పుడల్లా కొట్టడానికి మా యాంటీనా కర్ర లాగుతారని మా తాతగారు చెప్తుండేవారు. ) 
పొద్దున్నే స్కూలు, సాయత్రం శ్రీకాంత్ వాళ్ళింటికెళ్ళి వైకుంఠపాళో, వామనగుంటో ఆడుకుంటూ ఉండేవాడిని.

అలా రోజులు గడుస్తున్నా రోజుల్లో ఆ రోజు శివరాత్రి వచ్చింది. జాగరనకు మా ఇంటిదగ్గర నాలుగు కుటుంబాల వాళ్ళు మూకుమ్మడిగా చందాలేసుకుని  VCR తెచ్చారు. మా ఇంట్లో సినిమా వేసేందుకు కమిటీ నిర్ణయించింది. మా ఇంట్లో వాళ్ళు, బంధువర్గం, పేటలో ని వాళ్ళు అందరూ వచ్చేసరికి సుమారుగా ఒక వంద మందికి పైగా అయ్యారు.  పుష్కరాల్లో నిర్వహణాధికారి 'పచ్చచొక్కా అటువెళ్ళాకూడదు. అది లోతట్టు ప్రాంతం, ఈ రోజు నది పోటు మీదున్నది. అందరూ జాగ్రత్తగా ఉంటూ కోపరేట్ చెయ్యాలి' - అని మైకు పట్టుకుని అరుస్తున్నట్టు  మా నాన్నగారు సినిమా చూట్టానికి వచ్చిన వాళ్ళందరినీ అరుస్తూ హడావిడి చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్నారు.  ఇల్లు మాదే అయ్యేటప్పటికి నాదే ముందు సీటు. నెమ్మిదిగా సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు 'అంతులేని కధ'. నేను చూసిన మొదటి సినిమా. అది సినిమా కాదు నిజమైన నిజం అన్న భ్రమ లో తీక్షణంగా చూస్తున్నా. ఒకమ్మాయి ఇంటి భారం అంతా తనపైన వేసుకుని ఏన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తుంది. తన పేరు 'సరిత'.  ఆ పేరు వినగానే  నాలో తెలియని వైబ్రేషన్స్ మొదలయ్యాయి. అసలు సరిగా గమనిస్తే సరిత అన్న పేరు లోనే మత్తుంది, ష్టైలుంది, వైబ్రేషన్స్ ఉన్నాయని నాకప్పుడే తెలిసిపోయింది. ఎన్నో ఎన్నెన్నో కష్టాలు తనకు. పనికి మాలిన అన్న. పనికి రాని నాన్న. తనకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. సినిమా చూస్తున్నంత వరకు నన్ను నేను మరచిపోయి తన కోసం నేను ఏడవటం మొదలపెట్టాను. ఒక్కొక్కరు నెమ్మిదిగా నిద్రలోకి జారుకున్నారు. నేను మాత్రం అదే ధ్యాసగా రెప్పార్పకుండా చూశా. ప్రతి సీను ప్రతి ఫ్రేము అమాంతం బుర్రలోకెలిపోతున్నాయి. సరిత గురించి తెలిసేకొద్దీ తెలుసుకోవాలనిపించింది.  చివరకు కమల్ హాసన్ తనను పెళ్ళి చేసుకుంటాడు అని తెలిసి ఆనందపడ్డా.  కానీ ఆ రాస్కేల్ కమల్ హాసన్ సరిత గురించి ఆలోచించకుండా సరిత చెల్లి సుమతిని చేసుకోవటం చూసి తట్టుకోలేక పోయా. సినిమా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు కానీ సరిత మాత్రం నన్నొదిలివెళ్ళిపోలేదు. రాత్రంతా అసలు సరిత ఎలా బతుకుతుంది. కమల్ హాసల్ ఎందుకు అలా చేశాడు అని రాత్రంతా తన కోసం వెక్కి వెక్కి ఏడిచా. తెల్లారి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా శ్రీకాంత్ వాళ్ళింటికెళ్ళా.

శ్రీకాంత్ తెలివైనవాడు సమర్ధుడు లోకజ్ఞానం కలవాడు. ఒక సారి మా క్లాస్ కి లిల్లీ టీచర్ వచ్చి 'మీ క్లాస్ ఫస్ట్ ఎవరు ?' - అని అడిగితే. వాడు వెంటనే మా క్లాస్ ఫస్ట్ జొన్నలగడ్డ జ్యోతి కానీ, తెలివిగలవాడు మాత్రం అశ్విన్ అని సభాముఖంగా చెప్పి నా మనసు చూరగొన్నాడు.

లెక్కల H.W మధ్యలో జరిగిందంతా శ్రీకాంత్ కు చెప్పా. అంతా తీరిగ్గా విని, 
రేయ్ ఈ రోజు నుండి నువ్వు నా స్నేహితుడవని ఎవ్వరికీ చెప్పకు. ఈ రోజు నుండి నా పక్కన కోర్చోకు అన్నాడు. నేను నీకు 'ఠీ' కొట్తేస్తున్నా.
నేను : ఏమైంద్రా ?  'ఠీ' ఎందుకుకొడుతున్నావ్ ? అంత తప్పు నేనేం చేశా చెప్పు ?
వాడు : మరేంట్రా ? ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంటే నీపాటికి నువ్వు ఆరో ఎక్కం ఇంపోజిషన్ చేస్తున్నావా ? నీకు బుధ్ధుందా ?
నేను : ప్రేమేంట్రా ?
వాడు : మరదే నీకు తెలియంది. సరిత బాధ పడితే నువ్వు బాధపడ్డావా లేదా ?
నేను : అవును
వాడు : సరిత నవ్వితే నువ్వు నవ్వావ్ కదా ?
నేను : అవును
వాడు : సరిత నీకిష్టమే కదా.
నేను : ఇష్టం అంటే...తను హాపీగా ఉండాలిరా అంతే.
వాడు : అదేరా నేనూ చెప్పింది దాన్నే ప్రేమంటారు. అదే ప్రేమంటే. అయినా జొన్నలగడ్డ జ్యోతికన్నా నువ్వు తెలివి కలవాడివి నీకామాత్రం అర్ధంకాలేదా ?
నేను : నిజం చెప్పనా నాకు ముందే తెలుసురా, కానీ నీకు వెంటనే చెప్పటానికి సిగ్గుపడ్డా. సరేరా ఇప్పుడేంచెయ్యాలి.
వాడు : ముందు నీ హోమ్ వర్క్ చేసెయ్ తరవాత నాది కూడా చేసెయ్.  తొరాగా పెద్దైపో. ఉద్యోగం సంపాదించు ఈ లోపు నేను మా బాబయ్ ని అడిగి సరిత అడ్రస్ కనుక్కుంటా.  నువెళ్ళి తనకు తోడుగా ఉండి తన కష్టాలు తీరుద్దువుగాని. ఈ కమల్ హాసన్ గాడి సంగతి నాకొదిలెయ్. మస్తాన్ తో మాట్లాడి వాడికి స్కెచ్ నేను వేస్తా.
నేను సరే అన్నా
వాడు నా కన్నీళ్ళు తుడిచాడు
నేను వాడికి H.W చేశా.మరసటిరోజు మా అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా మొన్న సినిమా చూశాం కదా నేను పెద్దయ్యాక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని మా అమ్మకు చెప్పేశా. మా అమ్మ మురిసి పోయి 'సరేలేరా చేసుకుందువు' అని అనేటప్పటికి ఇక నాకు హద్దుల్లేకుండా పోయింది. ఇక ఆరోజు నుండి నాకు నూతనోత్సాహం మొదలైంది. సంకల్పం గురించి చెప్పిన మా నాన్నగారు 'Goals' గురించి కూడా చెప్పరు. అప్పటి నా Goals  
1) సరితను పెళ్ళిచేసుకుని తన కష్టాలు తీర్చాలి 
2) కమల్ హాసన్ ని చంపెయ్యాలి.

బాగా చదవాలి చదవాలి అని ప్రతి రోజు నా హోమ్వర్క్ తో పాటు శ్రీకాంత్ ది, వాళ్ళ చెల్లిది, వాళ్ళ అన్నది అందరి హోమ్వర్క్ నేనే చేసేవాడిని. వాడు కూడా నాకోసం సరిత ఆడ్రస్ కోసం, కమల్ హాసన్ ని ఎలా చంపాలి అని తెగాలోచిస్తుండేవాడు. నేను అదే ఊపులో జొన్నలగడ్డ జ్యోతిని ఓడ్చుకొట్టేసి 1st రాంక్ కూడా కొట్టేశా. 

మా పేటలో మా నాన్న గారికి పెదరాయుడుకున్నంత ఇమేజ్ ఉండేది. ఆపండ్రా అని గట్టిగా అరిచారంటే ఊరుచివర ఒంటేలు కెలుతున్న ఒంటికన్ను రాక్షసుడైనా మధ్యలో ఆపితీరాస్సిందే. పద్దతి, పిల్లల్ని పెంచేవిధానాం, మేనేజ్మెంట్ ఇలాంటి విషయాలలో ఎంతో మందికి మా నాన్నగారు ఆదర్శం. అలా ఆదర్శంగా తీసుకున్న వాళ్ళలో మా మామయ్య ఒకడు. ఆ సంవత్సరం మా మమయ్యకు కూతురు, నాకు మరదలు పుట్టింది. పుట్టీ పుట్టగానే అందరూ 'అస్సి గాడి పెళ్ళాం పుట్టేసింది' అని హడావిడి చేస్తున్నారు.  ఇంతలో మా మామయ్య వచ్చి 'ఏరా పెద్దయ్యాక మా అమ్మాయిని చేసుకుంటావా'- అని ఆడిగారు.  నాకు చాల కోపం వచ్చింది. నేను వెంటనే ఖరాఖండీగా లేదు మామయ్య నేను అల్రెడీ సరిత అనే అమ్మాయిను  ప్రేమిస్తున్నను, తననే పెళ్ళిచేసుకుంటా అని తేల్చిచేప్పేశా. మా మామయ్య బుర్ర బ్లాస్టయ్యి స్లోమొషన్ లో మా అమ్మ వంక చూశారు. మా అమ్మ అదే స్లోమొషన్ లో మా నాన్న వంక చూసింది. మా నాన్న కోపంతో ఊగిపోయారు. లుంగీ పైకట్టారు. చొక్కా చేతులు మడిచారు. నలుపుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మా నాన్నగారు కోపం వల్ల ఎర్రగా మారిపోయారు. 

అప్పటిదాకా విర్రవీగి పోయాడు Mike Kasprowicz(నేనే). తనకు ఇంకెవరూ అడ్డం లేరనుకున్నాడు. అదే బలుపుతో ఇష్టమొచ్చినట్టు మాచ్ కు ముందు నోరుజారి మాట్లాడాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరికేస్తున్నాడో తెలియక  మంచి లెంగ్త్ లో బాలేశాడని ఫీలయ్యాడు. తీరా వేశాక తెలిసింది తను బాల్ వేసింది సచిన్ టండుల్కర్ కని( మా నాన్న ) . సచిన్  మాంఛి దమ్ములాగి, ఎడం కాలితే దాన్ని నలిపేసి, క్రేన్ ఒక్కపొడి వేసుకుని ఫ్రంట్ ఫుట్ కొచ్చి, మరింత వేగంగా, మరింత బలంగా,  మరింత దృఢంగా ప్రపంచం కనీవినీ ఎరుకగని ఒక్కే ఒక్క షాట్. అంతే !! బాల్ ఎక్కడ పడిందో అని రవి శాస్త్రికి ఎతుక్కోవటం మొదలపెట్టాడు. నేను మాత్రం మూడు నెలలు మరో మాట మాట్లాడలేదు.

మూనెళ్ళ తరవాత.

శ్రీకాంత్ ఆయాస పడుతూ మాఇంటికొచ్చాడు. ఆ ఆయాసం పరిగెట్టటం వల్ల వచ్చింది కాదు నాకేదో చెప్పాలని తొందర పడటం వల్ల వచ్చిందని నాకర్ధమైంది. వచ్చీరాగానే నన్ను మస్తాన్ దగ్గరకు తీసుకెళ్ళాడు.  మటన్ మస్తాన్ మా స్కూల్లో 8th class B section. వాడు మాస్కూల్ కు ఎలాగోలా చదుకోవటానికి రాలేదు అందరికీ ఉచ్చ పోయించటానికి వచ్చాడు.
శ్రీకాంత్ > మస్తాన్ భయ్య చెప్పా కదా, వీడే అశ్విన్. ఒకన్నేసెయ్యాలి. 
మస్తాన్ > ఫొటో ఉందా ? 
శ్రీకాంత్ వెంటనే టేబుల్ మీద ఈ ఫొటో వేశాడు.

మస్తాన్ > వీడా ?
శ్రీకాంత్ > వీడు నీకు మందే తెలుసా ? 
మస్తాన్ > నాకెందుకు తెలియదు. వీడు మన కాళేశ్వర రావు మార్కెట్ కి రెగులర్ గా కూరలు కొంటానికి వస్తుంటాడు.
నా వంక తిరిగి చూశావా మస్తాన్ అంటే ఏంటో అని అర్ధం వచ్చేటట్టు కళ్ళెగరేశాడు శ్రీకాంత్
శ్రీకాంత్ > అయితే వీడిని కూడా వెసెయ్యాలి అని టేబుల్ మీద ఈ కింద ఫొటో వేశాడు. 
నేను > రేయ్ వీడెవడు ? 
శ్రీకాంత్ > నువ్వు నోరు మూసుకోని గమ్మున కూర్చోమన్నానా. నీ సరితను వేరే సినిమాలో పిర్ర మీద పిచ్చకొట్టుడు కొట్టాడు. ఇన్నాళ్ళూనీకు చెపితే హర్టవుతావని చెప్పలేదు. పనిలో పని వీడూ అయిపోతాడు.  ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
నేనేం మాట్లాడలేదు. 
మస్తాన్ >ఇద్దరికీ కలిపి ఏడొందలు అవుతుంది. 
నేను > రేపు సరస్వతీ మిస్ పిరియడ్ అవ్వగానే నేనొచ్చిస్తా.
రాత్రంతా ఎంచెయ్యలో అర్ధం కాలేదు. ఏడొందలంటే పెద్దమాటే. అప్పట్లో మా ఇంట్లో ఒక ఆవుండేది దాని పేరు కామధేనువు.  కామధేనువును ఏమడిగినా ఇస్తుందని ఎక్కడో విన్నట్టు గుర్తు. వెళ్ళి కామధేనువును ఆడిగా అది మా నాన్న పర్స్ ఇచ్చింది. అందులోంచి డబ్బులు తీసి లెక్కపెడుతుండగా మా అమ్మ చూసేసింది. మా అమ్మ స్లోమొషన్ లో మా నాన్న వంక చూసింది. మా నాన్న కోపంతో ఊగిపోయారు. లుంగీ పైకట్టారు. చొక్కా చేతులు మడిచారు. నలుపుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మా నాన్నగారు కోపం వల్ల  మళ్ళీ ఎర్రగా మారిపోయారు. 

Mike Kasprowicz కు ఇంకా సిగ్గు రాలేదు. అల్రెడీ సచిన్ మొదటి స్పెల్ లో చావ కొట్టిన సంగతి మరచిపోకముందే మరో దుశ్శాహసానికి పూనుకున్నాడు. ఈ సారి కొంచం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని బాల్ వేశాడు. అయినా సచిన్ ఊరుకోలేదు. ఎప్పటిలాగే సచిన్  మాంఛి దమ్ములాగి, ఎడం కాలితే దాన్ని నలిపేసి, క్రేన్ ఒక్కపొడి వేసుకుని ఫ్రంట్ ఫుట్ కొచ్చి, మరింత వేగంగా, మరింత బలంగా,  మరింత దృఢంగా పిచ్చా కొట్టుడు కొట్టాడు.  రవి శాస్త్రికి మళ్ళీ బాలెతుక్కోవటం మొదలపెట్టాడు. నేను మాత్రం మరో మూడు నెలలు మరో మాట మాట్లాడలేదు.

మూనెళ్ళ తరవాత.
శ్రీకాంత్ ఆయాస పడుతూ మాఇంటికొచ్చాడు. ఆ ఆయాసం పరిగెట్టటం వల్ల వచ్చింది కాదు నాకేదో చెప్పాలని తొందర పడటం వల్ల వచ్చిందని నాకర్ధమైంది. వచ్చీరాగానే 'రేయ్ నీ సరిత అడ్రస్ దొరికింది' - అన్నాడు.  ఆ మాటకు నాకు ప్రాణం లేచ్చొచ్చినట్టైంది. ఆత్రం తట్టుకోలేక ఎలా కనుక్కున్నావనడిగా. చాలా సింపుల్ రా సరిత ప్రతిరోజు బసెక్కగానే 'జింఖానా ప్లీస్' అంటుంది. బస్ మీద మద్రాసు అని రాసుంది. నువ్వు మద్రాసుకి వెళ్ళి జింఖాన బస్టాండ్ లో వెయిట్ చేస్తే పట్టేయచ్చు అన్నాడు. 

ఆ రాత్రంతా ఆలోచించా, మా నాన్నగారి దగ్గరుంటూ సరితను పెళ్ళి చేసుకోవటం కష్టమని నాకర్ధమైపోయింది. మద్రాసు పారిపోదామని నిర్ణయించికున్నా. కామధేనువుని అడిగి డబ్బుతీసుకుని పొద్దున్నే పినాకిని ఎక్కేశా. ట్రైన్ లో సరితను గుర్తుకు తెచ్చుకుంటూ నాలో నేను ఏడుస్తున్నా, నాలో నేను నవ్వుకుంటున్నా. ఇంతలో ఎవరో నామీద చెయ్యేశారు.
'బాబూ నువ్వు హనుమంతంగారబ్బాయివి కదా' అని అడిగాడు. కేశవరావుగారు, ఈయన కూడా మానాన్నను ఆదర్శంగా తీసుకున్నవాళ్ళలో మరొకతను. 

సీన్ కట్ చేస్తే ఇంట్లో అందరి ముందు ఉన్నా. అమ్మ ఏడుస్తుంది. చెల్లి వినమ్రతతో వణికిపోతుంది. పక్కింటివాళ్ళు, ఎరదిరింటి వాళ్ళు అటుగా వెళుతున్న గ్రహాంతరవాసులు అందరూ మాఇంట్లోకి తొంగి చూస్తున్నారు. ఇరవై నిమిషాల నిశబ్దం తరవాత ఒక్కసారిగా నాన్న 'ఒరేయ్ వెర్రి నాకొడకా ఎన్ని సార్లు చెప్పాలి ? ఏమని చెప్పాలి. నువ్వు దాన్ని పెళ్ళిచేసుకోవటం ఏంట్రా ? అందంతా సినిమారా నిజం కాదు ' అని అరిచారు
నేను > ఏమో నాన్న నాకవన్నీ తెలియదు. నేను పెరిగి పెద్దయ్ సరితను పెళ్ళి చేసుకోవాలి. తనకు అండగా ఉండాలి
నాన్న > సరితేంట్రా సరిత దాని పేరు జయప్రద. అదంతా యాక్టింగ్, నిజం కాదురా. తనకు నువ్వండగా ఉండటమేంట్రా నీ పిండాకూడు. ఏంటే వీడేంమాట్లాడుతున్నాడు.
మా అమ్మ ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.

నేను > నాకవన్నీ తెలియదు. నేను తనని పెళ్ళిచేసుకోవాల్సిందే.
నాన్న > ఇంకో మాటమాట్లాడావంటే చంపేస్తా.
నేను > ఆ రోజు కూడా అంతే నీవల్లే కమల్ హాసన్ కూడ తప్పించుకు పారిపోయాడు. లేకుంటే ఈ పాటికి ఆ కమల్ హాసన్ నాచేతులో ఛచ్చుండేవాడు.
ఈ డయలాగ్ కి మా నాన్న ఏం మాట్లాడలేక తెలియక మా అమ్మతో పాటు ఏడవటం మొదల పెట్టారు. 
రెండు మూడు నిమిషాల తరవాత. నాన్న కోపం తగ్గించుకోని నాదగ్గరకు వచ్చారు.
నాన్న >అది కాదు నాన్నా. అసలెలా చెప్పు మనది విజయవాడ, తను మద్రాసు. ఎక్కడుంటుందో తెలియదు. నీకన్నా చాల పెద్దది. నువ్వు పెద్దైయ్యేటప్పటికి తను ఇంకా పెద్దదైపోతుంది కాదా. అదంతా సినిమా నాన్నా అంతా యాక్టింగు. 

నాకు వెంటనే మా నాన్నాచెప్పిన పాఠం గుర్తోచ్చింది. సంకల్పం నాన్న సంకల్పం మనం దేనన్నా బలంగా కోరుకుంటే ఎక్కడ నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు అది వచ్చేస్తుంది అంతే నువ్వే చెప్పావ్ గా అని. అసలు పద్యం లోనుండి 'సిరితా' తీసేసి 'సరితా' చేర్చి. 
సరితా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్ - అన్నా

అది వినంగానే మా నాన్న పిచ్చి పీక్స్ చేరుకుంది. బిపి బాయిలింగ్ పాయింట్ దాటిపోయింది. శివుడు తాండవం చేస్తాడని తెలుసు కానీ ఎవరూ చూడలేదు. ఆ రోజు మాఇంట్లో వాళ్ళు మా ఎదురింటి వాళ్ళు, పక్కింటివాళ్ళు, గ్రహాంతరవాసులు కళ్ళారా చూశారు. అప్పటి దాకా One day మాత్రమే రుచిన చూసిన నాకు TestMatch అంటే ఏంటో చూపించారు. మా నాన్న కోపావేశాన్ని ఆపేవారు లేకపోయారు. దెబ్బకు నాకు జరమొచ్చేసింది.

జ్వరంలో కూడా 'సరితా సరితా' అని కలవరించేటప్పటికి అందరికీ హడలు పుట్టింది. మా నాన్న డాక్టర్ల చుట్టూ, సైకాలిజ్ట్ లు చుట్టు తిప్పటం మొదల పెట్టారు.  మా అమ్మైతే తాయిత్తులు, పూజలు, గాలేమన్న పట్టిందేమో అని క్షుద్రమాంత్రికులును తీసుకొచ్చి రకరకాల చేష్టలు చేసింది. ఇంక చేసేదేమిలేదనుకునే సమయంలో మా బామ్మ ఊరునుండి తిరిగొచ్చింది. మా నాన్న మా బామ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు. 
బామ్మ > ఓరి హనుమంతు దీనికా నువ్వింత డీలా పడిపోయింది. ఇంతజరుగుతుంటే నాకు ముందే చెప్పొదంట్రా ? 
నాన్నా > కొంపముంచి నీ దగ్గర ఐడియా గట్రా లాంటివి ఏమన్న ఉన్నాయంటావటే అమ్మా ?
మా బామ్మ  ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టింది. నీ తలకాయ్ తొందరపడకు ముందు చెప్పింది విను. అస్సిగాడివన్నీ నీ పోలికల్రా. చిన్నప్పుడు నువ్వూ అంతే అంజలి దేవిని చూసి ఇలానే గోల గోల చేశావు. చూస్తుంటే ఇదేదో వంశాచారంలా ఉంది అని మా బామ్మ చెప్పగానే  మా అమ్మ అదోలా మొహం పెట్టి చిరాగ్గా మా నాన్న వంక చూసింది. మా నాన్న మా అమ్మ వంక చూసి 'హి హి హి' అని నవ్వారు. అయినా అస్సిగాడి బాధల్లా ఏంటి ? జయప్రదను పెళ్ళి చేసుకోవాలి.ఎందుకు ? ఎందుకంటే అంతులేని కధ సినిమాలో జయప్రద చివరకు పెళ్ళి చేసుకోకుండా ఒక్కతే ఉండిపోయింది కాబట్టి. నువ్వేం చేస్తావంటే రామా టాకీస్ లో 'సీతా కళ్యాణం' సినిమా నడుస్తుంది. దానికి అస్సిగాడికి తీసుకెళ్ళు. ఆ సినిమాలో జయప్రద సీతమ్మ వారి వేషం వేసింది. చివరికి చక్కగా రాముని వారిని చేసుకుని పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సినిమా ఒకటికి రెండుసార్లు చూపించు. జయప్రద పెళ్ళై హాపీగా ఉందని వాడే సర్ధుకుంటాడు అని చురకత్తిలాంటి ఐడియా ఇచ్చింది.
నాన్నా > నువ్వు చెప్తుంటే ఇదేదో వర్కయ్యేటట్టుందే. అయినా నాకీ ఖర్మంటే అమ్మా. పెదరాయుడులాంటి వాడిని నాకీ పిచ్చగోలేంటి చెప్పు.
బామ్మ >  చూడు హనుమంతు జీవితంలో అంతా మన మంచికే అనుకోవాల్రా
నాన్నా > ఇందులో మంచేముంది నా బొంద.
బామ్మ > నీ కొడుకు జయప్రదను పెళ్ళి చేసుకుంటా అన్నాడు కాబట్టి సరిపోయింద్రా. ఈ సినిమాలోనో  ఆ సినిమాలోనో పెళ్ళి చేసుకుంది. అదే ఏ జయమాలినినో జ్యోతిలక్ష్మినో ప్రేమిస్తే అప్పుడు కనపడేవి నీకు చుక్కలు. వాళ్ళు ఏ సినిమాలో పెళ్ళి చేసుకున్నట్టు దాఖాలు లేవు. చివరకు నువ్వే ఆస్తులమ్మి వాళ్ళతో తియ్యాల్సొచ్చేది. వాళ్ళు పెళ్ళి చేసుకున్నట్టు సినిమాలో ఉంటే ఖచ్చితంగా నీ సినిమా ఫ్లాపై చచ్చేది.  దానికన్నా ఇందెంతో ఉత్తమం. కాబట్టి ఏది జరిగినా మన మంచికే. 

మా నాన్న మరసటి రోజే మా బామ్మ చెప్పినట్టు చేశారు. అందరూ అనుకున్నట్టుగానే నా ఆత్మారావు శాంతించాడు.
-----------
ఇది జరిగి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ ఎప్పుడన్నా నేను మా నాన్నా టివి చూస్తున్నప్పుడు జయప్రదొస్తే బాధతో నాన్నో, సిగ్గుతో నేనో అక్కడ నుండి లేచెలిపోతాం.

34 comments :

 1. Ha ha ha ,..
  Hillorious....
  Chaalaa baagaa raasaarandi aswin Garu.
  Prathi manishi okasaari baalyam loki vellipothaadu

  ReplyDelete
 2. Ha ha ha ,..
  Hillorious....
  Chaalaa baagaa raasaarandi aswin Garu.
  Prathi manishi okasaari baalyam loki vellipothaadu

  ReplyDelete
 3. Excellent sir....read entire blog...ee blog chaduvutunnantha sepu " nijanga nijamane bhramalo unmamani" childhood sweet memories anni okkasari gurtuchesaru....time machine unte entha bagundoo.....u r amazing sir.

  ReplyDelete
 4. Hahaha .... Super.
  అదే ఏ జయమాలినినో జ్యోతిలక్ష్మినో ప్రేమిస్తే అప్పుడు కనపడేవి నీకు చుక్కలు. వాళ్ళు ఏ సినిమాలో పెళ్ళి చేసుకున్నట్టు దాఖాలు లేవు. !!! Super point !!!

  ReplyDelete
 5. చాలా కాలం తరువాత మంచి పోస్ట్ చదివాను. ఆద్యంతం నవ్వుల మాయం. థాంక్స్.

  ReplyDelete
 6. సరిలిస్తిక్ పోయెట్రీ మాస్టారు.
  సూపర్ గా ఉంది.
  మీ నిజ జీవితం లో జరిగిన విషయాలతో లింక్ పెట్టారా...!!!!

  ReplyDelete
 7. You made my day Ashwin garu. Chala baga rasaru. :)

  ReplyDelete
 8. Evening call chesta , we will discuss.

  ReplyDelete
 9. Super! Mind-blowing.. terrific story telling Aswani!!

  ReplyDelete
 10. sooperb fantastic mindblowing aswinji...

  pls try to write more n more stories..we rely love ur posts..
  dis one made my day...kudos... :-)

  ReplyDelete
 11. Excellent Aswin!! Wanted to know, you do you get this idea?? Great Narration!

  ReplyDelete
 12. Aswin you are amazing, your story telling is superb

  ReplyDelete
 13. పోస్టంతా హిలారియాస్ .. కానీ మొదటి పేరా అద్భుతం .. ఒక గొప్ప చిత్రాన్ని సృజియించారు
  >> రేడియోలో యధావిధిగా జనరంజని. అమ్మ వంటచేస్తుంది. నాన్న బాయిలర్ పొగకు దగ్గుతూ వేన్నీళ్ళకు పుల్లలేస్తున్నారు. చదువురాని మా బామ్మ న్యూస్ పాపర్ను కళ్ళ కద్దుకోని మా తాతయ్య గారికి చదవటానికి సిధ్ధం చేస్తుంది. మా తాత గారు సెకండ్ ఫ్లోర్ ఎత్తునుండి కాఫీ గొంతులో పోసుకుంటున్నారు. చెల్లి చదువుకుంటుంది. నేను, పుస్తకం వెనకాల కుక్కకరిస్తే ప్రధమ చికిత్స ఏం చెయ్యాలో రాసుంటే ఆ బొమ్మాలూ గట్రా చూస్తున్నా.


  ReplyDelete
 14. Really hatsoff to you sir....,asalu alaa elaa rastarandi babuuu.,mee blog prati sari chadivi relaxed gaa feel avutham.....next tapa kosam waiting........

  ReplyDelete
 15. Super post.Bhale navvu vacchindhi...

  ReplyDelete
 16. aswin gaaru mee next tapa kosam waiting andi babuu....

  ReplyDelete
 17. eppudu pedtaroo aiynaa cheppandi pls.....

  ReplyDelete
 18. Vendi thera matala mantrikudu trivikram ite, kanapadani matala mantrikudivi bhayyya nuvvu simply superb !!!!

  ReplyDelete
 19. అద్భుతమైన కథ.. తెగ నవ్వొచ్చింది ...

  .కిషోర్

  ReplyDelete
 20. Hilarious . కళ్ళకు కట్టినట్టు చూపించావు. నవ్వు ఆపుకోవడం కష్‌టమైంది. 👍👍

  ReplyDelete
 21. Adbhutham����������������

  ReplyDelete
 22. Kamal hassan ki scketch eanti ra swami.. Nijamga arachakam..

  Breaks ivvakunda Chad a vale nappy any poorthigaa.. Line line Ku navvapukoleka poyanu..

  Super

  ReplyDelete
 23. Bhayya , paraayi desam lo ee post chadivi pichodilaa navvuthunte janaalu vintha gaa choosaaru, ee madhya kaalam lo ilaa navvatam ide modatisaari

  ReplyDelete
 24. ఒంటరిగా, మంచం మీద పడుకొని, ఉన్నట్టుండి, పెద్దగా పిచ్చ పిచ్చగా నవ్వుతుంటే, కుటుంబసభ్యులు వింత జంతువును చూసినట్టు చూస్తుంటె..అచ్చం..మీరు ఎలా ఫీల్ అయ్యారో, నేను కూడా అలానే ఫీల్ అయ్యా..మీ రచన అద్భుతమైన ఆనందసంభ్రమాశ్చర్యాలని కలిగించింది. మీరు కెవ్ కేకండీ బాబు - గణపతి రాజు, ఒక అనామకుడి రూపంలో..

  ReplyDelete